Ap Elections : పెద్దారెడ్డి సవాల్ విన్నారా? జేసీ కాలుదువ్వడాన్ని చూశారా? తాడిపత్రిని ఆపేదెవరు?
తాడిపత్రిలో ఇప్పుడు ఫ్యాక్షన్ రాజకీయాలకు తెరలేచినట్లే కనపడుతుంది. జేసీ, పెద్దారెడ్డి వర్గీయులు కక్షతో రగిలిపోతున్నారు
కొడవళ్లు.. కత్తులు... నాటు బాంబులు.. హత్యలు.. ప్రతీకార ఘర్షణలు.. తాడిపత్రి నియోజకవర్గం ఒకప్పుడు అట్టుడికిపోయేది. రెండు వర్గాల మధ్య జరిగే ఘర్షణలో ఎందరో అమాయకులు బలయ్యారు. వారి కుటుంబాలు ఇప్పటికీ కోలుకోలేదు. అలాంటి తాడిపత్రిలో మళ్లీ ఇప్పుడు ఫ్యాక్షన్ రాజకీయాలకు తెరలేచినట్లే కనపడుతుంది. గతంలో ఎన్నడూ లేని విధంగా ఘర్షణలు జరిగాయి. పోలీసులు కూడా ఏమి చేయలేని నిస్సహాయ స్థితిలోకి వెళ్లిపోయారంటే అతిశయోక్తి కాదేమో. ఇదే విషయాన్ని కేంద్ర ఎన్నికల కమిషన్ కు ప్రత్యేక దర్యాప్తు బృందం ఇచ్చిన నివేదికలోనూ పేర్కొనడం గమనార్హం. తాడిపత్రి ఇక తగలపడిపోవాల్సిందేనా? కౌంటింగ్ తర్వాత కూడా అక్కడ ఘర్షణలకు ఫుల్ స్టాప్ పడతాయన్న నమ్మకం పోలీసు అధికారులకే కలగడం లేదంటే పరిస్థితి నివురుగప్పిన నిప్పులా ఉందని అర్థం చేసుకోవచ్చు. ఇంటలిజెన్స్ వర్గాలు కూడా ఇదే చెబుతున్నాయి. తాడిపత్రిలో తిరిగి ఘర్షణలు చెలరేగే అవకాశముందని హెచ్చరించాయి.